ఒక్కొక్క మన్వంతరములో, కల్పములో, యుగములో దుష్టశక్తులు విజృంభించిన సమయములో, ఆదిప్రణవరూపుడు, పరబ్రహ్మ స్వరూపమైన మహాగణపతి యొక్క స్త్రీరూపమే శ్రీదేవిగా, ఆమెయే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అవతరించి మధుకైటభులను, మహిషాసురున్ని, శుంభనిశుంభులను, చండముండులను, దుర్గమాసురున్ని, డోలాసురున్ని సంహరించినట్లు దేవిభాగవతములో శక్తి స్వరూపిణి భగవతి ఆదిపరాశక్తి తన యొక్క మహామహిమను బహిర్గతపరచి సమస్త లోకాలకు శాంతిని చేకూర్చినదని చెప్పబడింది.
దేవి నవరాత్రులు గురువారం 3rd అక్టోబర్ 2024 నుండి 12th October 2024 వరకు జరుగును.
శుద్ధ సత్వస్వరూపిణియై, సర్వసంపదలకు అధిష్ఠాత్రిగా, సర్వసస్యాత్మికగా, భూతకోటికి జీవనోపాయ రూపిణిగా, సర్వమంగళ కారిణిగా, ఐశ్వర్యప్రదాయినిగా ఉన్న అష్టలక్ష్ముల సమిష్టి రూపమే శ్రీ మహాలక్ష్మి.
“యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్త స్యై నమస్త స్యై నమోనమః :
అనగా అన్ని జీవులలో ఉండే లక్ష్మీస్వరూపాన్ని శరన్నవరాత్రులలో ఆదిలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, ధైర్యలక్ష్మీ, గజలక్ష్మీ, సంతానలక్ష్మి, విజయలక్ష్మీ, విద్యాలక్ష్మీ, ధనలక్ష్మీ, మరకత శ్రీలక్ష్మీ, రూపాలుగా ఆరాధించడం వల్ల అప్టైశ్వర్య, ఆరోగ్యప్రాప్తి కలుగుతుంది. శతృపీడ తొలగి సర్వత్రా విజయం సిద్ధిస్తుంది.
సత్కర్మలు, శుచీ, శుభ్రత, సదాచారం ఉన్న ఇంట కొలువై ఇహపరాలను అందిస్తూ, ఆనందం, సంతోషం, సుఖం, శాంతి, సౌఖ్యాలను కలుగజేస్తూ సృష్టిలోని సమస్త సంపదలను అనుగ్రహించే తల్లిని ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరిగే దేవి శరన్నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారములో దేదీప్యమానముగా దర్శనమిచ్చే "మరకత శ్రీ మహాలక్ష్మీ దేవిని" దర్శించి పూజించి, నైవేద్యాలను సమర్పించి అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.